ఇస్లాం ఎందుకు ?

 ఇస్లాం ధర్మంలోని అద్భుతాలు మరియు ప్రయోజనాలు

అన్ని మతాలు ఒకటేనా? వాటన్నింటిలో ఏది సరైన మతమో నాకెలా తెలుస్తుంది ? నేను ఇస్లాం ధర్మాన్నే ఎందుకు ఎన్నుకోవాలి?

ఇతర ధర్మాలకు మరియు సిద్ధాంతాలకు భిన్నంగా ఇస్లాంలో స్పష్టంగా కనబడే ముఖ్య సౌందర్యాలు, లాభాలు మరియు ప్రత్యేకతల గురించి చర్చించడమే ఈ కరపత్రం యొక్క లక్ష్యం.

1. సృష్టికర్తతో దగ్గర సంబంధం

తన సృష్టికర్తతో ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన వ్యక్తిగత సంబంధంపై ఇస్లాం ధర్మ కేంద్రభాగం దృష్టి కేంద్రీకరిస్తున్నది. శాశ్వత సంతోషానికి తాళం చెవి - ‘సృష్టికర్త గురించి స్థిరమైన అవగాహన’. ఒక దైవవిశ్వాసి దానిని కలిగి ఉండేలా ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది.

సృష్టికర్తే విశ్వశాంతి మూలమని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఈ ముఖ్య సంబంధంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరియు సృష్టికర్త మార్గదర్శకత్వాన్ని అనుసరించడం ద్వారా దైవవిశ్వాసులు అంతర్గత శాంతి మరియు ప్రశాంతత పొందగలరు. స్వంత కోరికలను అనుసరించడం లేదా ప్రాపంచిక సంపద కూడగట్టడం వంటి ఇతర మార్గాల ద్వారా శాశ్వత సంతోషాన్ని సంపాదించే చేసే ప్రయత్నం మనలోని శూన్యాన్ని ఎన్నడూ నింపలేదు. కేవలం సృష్టికర్త యొక్క అవగాహన, జ్ఞానం మాత్రమే ఈ ఆవశ్యకతను నింపుతుంది.

అలాగే సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపడం మరియు విధేయత చూపడంలోనే నిజమైన ప్రశాంతత దొరుకుతుంది: నిజంగా, దైవధ్యానంలోనే హృదయాలకు విశ్రాంతి దొరుకుతుంది.” ఖుర్ఆన్ 13:28

ముస్లింలు తమ సృష్టికర్తతో డైరక్ట్ కనెక్షన్ కలిగి ఉండటమే సృష్టికర్తతో వారి ఈ దగ్గర సంబంధానికి అసలు కారణం. దైవారాధనలో భాగంగా ఇతరులను పూజించడం లేదా ఇతరుల ద్వారా ఆరాధించడం వంటి ఇస్లామేతర ధర్మాల మధ్యవర్తిత్వ, సిఫారసు పద్ధతులు ఇస్లాం ధర్మంలో లేవు.

2. జీవితంపై పాజిటివ్ దృక్పథం

తమ జీవితంలో జరిగే ‘మంచి - చెడులు’ నిజానికి సృష్టికర్త నుండి వచ్చే పరీక్షలే అనే స్పష్టమైన దృక్పథాన్ని ఇస్లాం ధర్మం మానవుడికి ఇస్తున్నది. సృష్టికర్తకు కృతజ్ఞత తెలుపడం మరియు విధేయత చూపడం ద్వారా మొత్తం మానవజీవిత ప్రయోజనానికి సంబంధించిన పరిస్థితులకు అనుగుణంగా ఆ ఘటనలు అర్థం చేసుకునేలా ఇస్లాం ధర్మం మానవుడిని ప్రోత్సహిస్తున్నది. ఎవరు తన మార్గదర్శకత్వాన్ని స్వచ్ఛందంగా, మనస్పూర్తిగా ఎంచుకుంటారో పరీక్షించేందుకు వారికి అవసరమైనన్ని తెలివితేటలతో మరియు స్వేచ్ఛతో సృష్టికర్త మానవులను సృష్టించినాడు. ఈ ప్రాపంచిక జీవితం చిట్టచివరి పరీక్షా మైదానం. మనకు జరగబోయే ప్రతిదీ మన నియంత్రణలో లేకపోయినా, మన రియాక్షన్ ను మాత్రం నియంత్రించుకోగలిగే శక్తి మనకు ప్రసాదించబడింది. మన నియంత్రణలో ఉన్న దానిపై దృష్టి కేంద్రీకరించమని, సృష్టికర్త మనకు ప్రసాదించిన అనుగ్రహాలకు బదులుగా ఆయనకు కృతజ్ఞత తెలపాలని, కష్టనష్టాలలో సహనంతో ఉండాలని ఇస్లాం ధర్మం మానవుడిని ప్రోత్సహిస్తున్నది. సహనం లేదా కృతజ్ఞతసంతోష జీవితం యొక్క ఫార్ములా ఇదే.

ప్రాపంచిక సుఖసంతోషాలలో అతిశయించడం నుండి దూరంగా ఉండమని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఎందుకంటే, అలాంటి స్థితి సృష్టికర్తను మరిచిపోయేలా చేస్తుంది. అలాగే కష్టనష్టాలలో మితిమీరి దుఃఖించడం నుండి దూరంగా ఉండమని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఎందుకంటే అది సృష్టికర్తపై ఆశలు కోల్పోయేలా చేసి, ఆయనను నిందించేలా చేస్తుంది. ఒక ముస్లిం ఈ భౌతిక ప్రపంచంతో హద్దులు దాటి అనుబంధం పెంచుకోకుండా, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కునే శక్తి కలిగి ఉండటమే కాకుండా, సమాజానికి ప్రయోజనం చేకూర్చుతూ మరియు ఉదారంగా ప్రవర్తిస్తూ జీవిస్తాడు. కాబట్టి ఎంతో సంతులిత మరియు సానుకూల జీవిత దృక్పథం కలిగి ఉంటాడు.   

3. పరిశుద్ధమైన మరియు స్పష్టమైన దైవభావన

ఇస్లామేతర ధర్మాల పేర్లు వాటి మూలస్థాపకుడు లేదా మూలసమాజం పేరు మీద ప్రఖ్యాతి చెందాయి. కానీ, ఇస్లాం ధర్మం విషయంలో అలా జరగలేదు. అరబీ భాషలోని ‘ఇస్లాం’ అనే పదం ఒక attributive title అంటే లక్షణాల్ని తెలిపే పదం. ఇది ‘సర్వలోకాల సృష్టికర్తకు విధేయత’ చూపడంలోని ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ పేరులోని ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే అది అసలు ఎక్కడా రాజీ పడకుండా సర్వలోక సృష్టికర్త యొక్క ఏకత్వం, సార్వభౌమత్వం, ఘనత, పరిపూర్ణతలను ప్రకటిస్తున్నది. అందువలన ఇది ఇస్లాం బోధించే సృష్టికర్త యొక్క స్వచ్ఛమైన దివ్యలక్షణాలలో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. ఉదాహరణ -

సర్వలోక సృష్టికర్త ఒక్కడే మరియు ఆయన ఏకైకుడు:

  • ఆయనకు భాగస్వాములు లేరు, ఆయనకు సాటి లేరు మరియు ఆయనకు ప్రత్యర్థులు లేరు.
  • ఆయనకు తండ్రి, తల్లి, కొడుకులు, కూతుళ్ళు లేదా భార్యలు లేరు.
  • కేవలం ఆయన మాత్రమే ఆరాధించబడే అర్హతలు కలిగి ఉన్నాడు.

ఆయన సర్వశక్తిమంతుడు:

  • సమస్త సృష్టిపై ఆయన సంపూర్ణ అధికారం మరియు శక్తి కలిగి ఉన్నాడు.
  • ఆయనకు మనం చూపే విధేయత ఆయన శక్తినేమీ పెంచదు. అలాగే మన అవిధేయత ఆయన శక్తినేమీ తగ్గించదు..

ఆయన అత్యంత మహోన్నతుడు:

  • ఆయన కంటే మహోన్నతమైనదేదీ లేదు. అలాగే ఆయనతో పోల్చదగినదేదీ లేదు.
  • సృష్టితాల లక్షణాలకూ మరియు ఆయన దివ్యలక్షణాలకూ మధ్య అస్సలు పోలిక లేదు.
  • ఆయనలోని ఏ భాగమూ ఎవ్వరిలోనూ, ఎందులోనూ ప్రవేశించదు.

ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు:

  • ఆరు రోజుల విశ్వసృష్టి పూర్తి చేసిన తర్వాత ఏడవ రోజు విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఆయనకు అస్సలు లేదు. ఎందుకంటే ఆయన అపరిమితమైన శక్తిసామర్ధ్యాలు కలిగిన వాడు.
  • ఆయన తన పరిపూర్ణ దివ్యలక్షణాల్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాడు. తన పరిపూర్ణత్వానికి రాజీ పడ వలసి వచ్చే ఏ పనీ ఆయన చేయడు. ఉదాహరణకు – ఇతర ధర్మాలు తెలుపుతున్నట్లుగా మానవ రూపం ధరించడం. తన మహోన్నత స్థాయికి తగిన దివ్యకార్యాలను వదిలి స్వయంగా అలాంటి అల్పమైన పనులు చేయవలసిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి, ఒకవేళ తన దైవత్వ స్థాయిని వదిలి, మానవ రూపంలో అవతరించాడని భావిస్తే, ఆ క్షణం నుండి ఆయన అస్సలు దేవుడు కాజాలడు.

4. సాక్ష్యాధారాలు మరియు దైవవిశ్వాసములు నొక్కి వక్కాణించటం

ఇస్లాం ధర్మంలో దైవవిశ్వాసం స్పష్టమైన సాక్ష్యాధారాలపై మాత్రమే ఆధారపడి ఉంది. సృష్టికర్త ప్రసాదించిన తెలివితేటలు ఉపయోగించి, జీవితం గురించి మరియు సువిశాల విశ్వం గురించి లోతుగా ఆలోచించమని ప్రజలను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రాపంచిక జీవితం ఒక పరీక్షాకాలం. అయినా, విశాల దృక్పథంతో మరియు చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేసే ప్రజల కొరకు సృష్టికర్త ఎన్నో సూచనలు మరియు మార్గదర్శకత్వం పంపినాడు.

నిశ్చయంగా మేము విషయాలను స్పష్టంగా తెలిపే సూచనలు పంపాము: మరియు తను తలిచిన వారికి అల్లాహ్ సన్మార్గాన్ని చూపుతాడు.”Quran 24:46

ఇతర ధర్మాల ప్రజలు తమ ధర్మ మూలగ్రంథ అవతరణ గురించి విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. దీనికి భిన్నంగా ఇస్లాం ధర్మ మూలగ్రంథమైన ఖుర్ఆన్ గ్రంథం సర్వలోక సృష్టికర్త నుండే తిన్నగా అవతరించబడింది అనే వాస్తవాన్ని అనేక ఋజువులు, సూచనలు, చిహ్నాలు మరియు మహిమలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి.

ఖుర్ఆన్ :

·      23 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అవతరించినా, దానిలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు, లోపాలు, దోషాలు మరియు పరస్పర వైరుధ్యాలు లేవని, అది వాటికి అతీతంగా ఉందని ఋజువు అయింది.

·      అరబీ భాషలో అవతరించిన నాటి నుండి, దానిలోని ప్రతి అక్షరం యథాతథంగా దాని అసలు రూపంలో ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాకుండా, ఒక్క అక్షరం కూడా కోల్పోకుండా ఈనాటికీ దాని అసలు అవతరించిన రూపంలోనే భద్రంగా ఉన్నది.

·      దానిలో చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం సులభమైన, స్వచ్ఛమైన మరియు సర్వసామాన్య సందేశం ఉన్నది.

·      అసమాన, అపూర్వ మరియు అనుకరింప శక్యం కాని భాషాశైలి కలిగి ఉన్నది. విశ్వవ్యాప్తంగా అది అరబీ భాషా వాగ్ధాటిలో మరియు సాహిత్య సౌందర్యంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఏకైక గ్రంథంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, వాస్తవానికి చదవటం వ్రాయటం రాని అంటే అక్షరజ్ఞానం లేని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరించటమనేది సృష్టకర్త ఘనతను తెలిపే ఒక గొప్ప సూచన.

·      1400 సంవత్సరాలకు పూర్వం అవతరించబడినప్పటికీ, ఈ మధ్య కాలంలో మాత్రమే శాస్త్రజ్ఞులు కనిపెట్టగలిగిన అనేకానేక అద్భుత వైజ్ఞానిక వాస్తవాలు దానిలో స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి.

ఖుర్ఆన్ లో ఎన్నో అపూర్వ మరియు అద్భుత అంశాలు 14 శతాబ్దాలకు పూర్వమే ఎలా ప్రస్తావించబడినాయి అనే ప్రశ్నకు దానిని అవతరింపజేసింది సృష్టికర్త కాకుండా ముమ్మాటికీ మరొకరు కాజాలరు అనేది అత్యంత వివేకాత్మకమైన మరియు హేతుబద్ద జవాబు.

5. పాపాల మన్నింపు

సృష్టికర్త దయాదాక్షిణ్యాలు ఆశించడం మరియు ఆయన కఠినశిక్షలకు భయ పడటం – ఈ రెండింటి మధ్య సంతులనాన్ని కలిగి ఉండమని ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది. నమ్రత, వినయవిధేయతలతో కూడిన సానుకూల జీవితం గడపడానికి ఈ రెండింటి మధ్య సంతులనం తప్పనిసరి.

మనం పరిశుద్ధ స్థితిలో పుడతాం, కానీ పాపం చేసే స్వేచ్ఛ మనకు ఇవ్వబడింది. మనం పరిపూర్ణులం కాదని మరియు తప్పులు చేసే అవకాశం ఉందని మనల్ని సృష్టించిన సృష్టికర్తకు బాగా తెలుసు. అయితే అలాంటి పాపాలు చేసినప్పుడు, మనమెలా ప్రవర్తిస్తామనేదే అసలు విషయం.

అల్లాహ్ యొక్క దయ లభించదని నిరాశ చెందకండి.; మీ పాపాలన్నింటినీ ఆయన క్క్షమించగలడు.” ఖుర్ఆన్ 39:53

సృష్టకర్త అపార కృపాశీలుడనీ మరియు త్రికరణశుద్ధిగా పశ్చాత్తాప పడుతూ క్షమాపణ అర్థించే ప్రజలను తప్పక మన్నిస్తాడనీ ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. చిత్తశుద్ధి, పశ్చాత్తాపం, అలాంటి పాపం మరలా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవడం మరియు చెడు పనులకు దూరంగా ఉంటూ నిగ్రహం పాటించడం మొదలైనవి అలా క్షమాపణ అడగటంలో ఉండవలసిన ముఖ్యాంశాలు. అలా మనలో స్వయం వికాసం మరియు స్వయం శుద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రక్రియ డైరక్టుగా వ్యక్తికి మరియు సృష్టికర్తకు మధ్య మాత్రమే జరగాలి. తాము చేసిన తప్పులు, పాపాల గురించి మతాచార్యులకు తెలుపవలసిన లేదా వారి ముందు ఒప్పుకోవసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇంకా, పాప ప్రక్షాళన కోసం దేవుడు స్వయంగా బలి అవడం లేదా మరెవరినైనా బలి ఇవ్వమని కోరడంలో అసత్యం తప్ప మరేమీ లేదు.  

6. జవాబుదారీతనం మరియు అంతిమ న్యాయం

సృష్టికర్త అణువంత కూడా పక్షపాతం చూపని అత్యంత మహోన్నత న్యాయస్థుడనీ మరియు తీర్పుదినాన ప్రతి వ్యక్తీ స్వంత కర్మలకు అతడే బాధ్యుడిగా నిలబెట్టబడతాడనీ ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. మంచి- చెడుల మధ్య భేదం కనుక్కునే తెలివితేటలు మరియు రెండింటిలో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఇవ్వబడటం వలన, ప్రతి ఒక్కరూ తమ తమ కర్మలకు స్వయంగా బాధ్యులవుతారు.

ప్రతి ఒక్కరికీ పుణ్యాలు ప్రసాదించబడే లేదా శిక్షించబడే ఒక అంతిమ తీర్పుదినం తప్పకుండా ఉండాలనేది తిరస్కరించలేని ఒక న్యాయమైన డిమాండు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి తీర్పుదినం లేకపోతే, ఈ జీవితానికి అర్థం పర్థం లేకుండా పోతుంది.

మన బాధ్యతలను మనం ఎంత మంచిగా పూర్తి చేశాం మరియు మనకు ఇవ్వబడిన స్వేచ్ఛను ఎంత మంచిగా వాడుకున్నాం అనే వాటిపై అంతిమ విచారణ జరుగుతుందని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. మనం చేసే ప్రతి పనీ తెలుసుకునే మరియు చూసే మహత్తర శక్తి గల సర్వలోక జ్ఞానవంతుడు మరియు వివేకవంతుడు అయిన సృష్టికర్తచే ఆనాడు విచారించబడతాము. ఇలాంటి భావన కలిసి మెలిసి జీవించేలా సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేగాక చిట్టచివరికి న్యాయానిదే పైచేయి అవుతుందనే సంతృప్తి ప్రజలలో కలిగిస్తుంది. 

7. వ్యావహారిక మరియు సంతులిత జీవిత విధానం

దైవవిశ్వాసం మరియు ఆచరణల మధ్య సరైన సంతులనాన్ని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది. స్థిరమైన జీవితం కోసం ఇవి రెండూ అవసరం. అన్నిరకాల పరిస్థితులలో మరియు సందర్భాలలో పనికి వచ్చే మార్గదర్శకత్వాన్ని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ప్రజల ఆధ్యాత్మిక, శారీరక, మానసిక మరియు సామాజిక అవసరాలు పూర్తి చేసే ప్రాక్టికల్ ఆరాధనా చర్యలతో కూడిన ఒక ప్రయోగాత్మక ధర్మం – ఇస్లాం ధర్మం.

అనేక ప్రయోజనాలతో నిండియున్న కొన్ని ఆచరణాత్మక ఆరాధనా చర్యలు:

·      రోజువారీ ఐదు పూటల నమాజు – తన ప్రభువుతో నిరంతర సంబంధం కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక అవసరాన్ని పూర్తి చేయడం ద్వారా ఆత్మను సుసంపన్నం చేస్తుంది (ప్రత్యేకంగా నేటి బిజీ జీవితంలో); రుకూ (మోకాళ్ళపై చేతులు ఆన్చి ముందుకు వంగోటం) మరియు సజ్దాల (సాష్టాంగం) ద్వారా మనలో అణుకుల, నమ్రత, విధేయతలను నింపుతుంది; సామూహికంగా చేసే నమాజు దైవవిశ్వాసుల మధ్య కలిగే విభేదాలు, అహంకారం, జాతి వివక్షలను తొలిగిస్తుంది; సృష్టికర్త ముందు క్రమం తప్పకుండా నిలబడటం వలన పాపాలు, తప్పులు చేయకుండా ఆపుతుంది.

·      విధిదానం (జకాత్) – స్వార్థపరత్వం నుండి మనిషిని పరిశుద్ధం చేస్తుంది; నిరుపేదలపై సానుభూతి, దయ చూపేలా ప్రోత్సహిస్తుంది; సృష్టికర్త ప్రసాదించిన అనుగ్రహాలను జ్ఞాపకం చేస్తుంది; బీదరికం నిర్మూలనకు దోహదపడుతుంది; ధనికుల మరియు పేదల మధ్య ఉండే దూరాన్ని తగ్గిస్తుంది.

·      రమదాన్ నెలలోని ఉపవాసం – ఆధ్యాత్మిక స్వీయ శుద్ధీకరణ జరుగుతుంది, ఆత్మ నిగ్రహం మరియు ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి; వైజ్ఞానికపరంగా నిరూపించబడిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి; బీదసాదల కష్టాలపై సానుభూతి కలుగుతుంది మరియు వాటి అవగాహనకు అవకాశం ఉంది; సృష్టికర్తకు విధేయత చూపే అలవాటు అలవర్చుకునేలా ప్రజలకు శిక్షణ లభిస్తుంది.

·      హజ్ యాత్ర – మక్కా వద్ద ప్రజలందరూ ఒకే విధమైన మామూలు తెల్లటి వస్త్రాలు చుట్టుకొని ఎలాంటి భేదభావాలు లేకుండా ఏకకాలంలో సామూహికంగా అనేక పుణ్యకార్యాలు చేయడమనేది జాతి, కులం, రంగు మరియు స్టేటస్ లకు అతీతంగా మానవులందరినీ సంఘటితం చేస్తుంది.

సమస్త మానవజాతి కోసం చిట్టచివరిగా ఇస్లాం ధర్మాన్ని మన సృష్టికర్త పంపినాడు. దీనిలోని ప్రతి ధర్మాజ్ఞ సరిగ్గా ఆచరిస్తే, అది వ్యక్తికీ మరియు సమాజానికీ తప్పక ప్రయోజనం చేకూరుస్తుంది. ఖుర్ఆన్ లో తెలుపబడిన కొన్ని మంచి అలవాట్లు – నిజాయితీగా జీవించడం, క్షమించడం, సత్యం పలకడం, భార్యతో మంచిగా ప్రవర్తించడం, సహనం చూపడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, మధ్యేమార్గాన్ని అనుసరించడం, చిత్తశుద్ధి కలిగి ఉండటం, తల్లిదండ్రులను, కుటుంబాన్ని మరియు పెద్దలను గౌరవించడం మొదలైనవి. ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక వ్యక్తిగత మరియు సామాజిక చీడలను సమూలంగా నిర్మూలించే లేదా తగ్గించే ఇలాంటి అనేక మూలసూత్రాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయి.

8. విశ్వవ్యాప్త మరియు కాలాతీత దివ్యసందేశం

ఆదం సృష్టి నుండి అంతిమ తీర్పుదినం వరకు అన్ని కాలాలలో మొత్తం మానవజాతికి వర్తించే సందేశం ఇస్లాం ధర్మంలో ఉన్నది. ఇంత వరకూ వర్తించినట్లే, అది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది.

ఎందుకంటే ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాలు ప్రకృతి సహజమైనవి. ఉదాహరణకు - సృష్టికర్త ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలు దైవవిశ్వాసం మరియు పుణ్యకార్యాల ద్వారా మాత్రమే ప్రభువు అనుగ్రహం పొందగలరు మరియు తమ మధ్య భేదాన్ని గుర్తించగలరు – అంతేగాని జాతి, సంపద, లింగ, కుల, స్టేటస్ లేదా సాంఘిక వర్గీకరణల ద్వారా కాదు.

చివరి మాట

ఇస్లాం ధర్మం యొక్క కాలాతీత మరియు అద్భుత సందేశం మరియు నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ ప్రవక్తలతో (అలైహిస్సలాం) పాటు మొత్తం ప్రవక్తలందరి సందేశం ఒకటే. వారందరూ ఏకైక నిజ ప్రభువుకు మాత్రమే సమర్పించుకోండి అంటే ముస్లింగా మారండి అని తమ ప్రజలను పిలిచారు. అరబీభాషలో ముస్లిం అంటే సమర్పించుకోవటం. ఇలా సృష్టికర్తకు సమర్పించు కోవడం ద్వారా సృష్టికర్త ఘనతను గుర్తిస్తూ మరియు చిత్తశుద్ధితో కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తూ మానవజీవిత ఉద్ధేశ్యాన్ని పూర్తి చేసి, ఇహపరలోకాలలో సాఫల్యం పొందే అవకాశం ఉంది. అలా సమర్పించుకోవడం ద్వారా ఇస్లాం ధర్మంలోని లెక్కలేన్ని లాభాలు కూడా పొందవచ్చు. 


Choose Your Language