ఇస్లాం గురించి సాధారణంగా అడిగే 7 ప్రశ్నలు

1. ఇస్లాం అంటే ఏమిటి ?

ఇస్లాం అనేది సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రజల వైపుకు అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ ఆచరించి చూపిన ఒక సత్యధర్మం పేరు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ‘ఒక ఆదర్శ జీవన విధానం’. ఇతర ధర్మాలతో పోల్చితే ఇస్లాం ధర్మం యొక్క పేరు ఒక ప్రత్యేకమైన సజీవ ధర్మం పేరుగా నిలుస్తుంది; క్రైస్తవమతం, బౌద్ధమతం లేదా జొరాస్ట్రియనిజం మాదిరిగా అది ఎవరో ఒక వ్యక్తి పేరును; యూదమతం వలే ఒక తెగ పేరును; లేక హిందూమతం వలే ఒక ప్రాంతం పేరును సూచించుట లేదు. ఇస్లాం అనే పదం వచ్చిన అరబీ మూలపదానికి అసలు అర్థం శాంతి, సంరక్షణ, అభివాదన, అభయం, నిరపరాధిత్వం, పరిపూర్ణత్వం, సమర్పణ, స్వీకరణ, లొంగుబాటు, అర్పించుకొనుట మరియు మోక్షం. ఇస్లాం అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఏమిటంటే అల్లాహ్ కు సమర్పించుకొనుట, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం, మనస్పూర్తిగా ఆయన ధర్మచట్టాలకు సమ్మతించడం మరియు విధేయత చూపడం. ఇలా సమర్పించుకోవడం ద్వారా ఆ పదం యొక్క భాషాపరమైన అర్థంలోని శాంతి, సంరక్షణ మరియు పరిపూర్ణత పొందుతారు. కాబట్టి, ఒక ముస్లిం లేదా ముస్లిమహ్ అంటే అల్లాహ్ కు సమర్పించుకున్నవారు. ఒక వ్యక్తి యొక్క ఇస్లాం పాపాల వలన, అజ్ఞానం వలన, తప్పుడు పనులు చేయడం వలన బలహీనమై పోతుంది. అల్లాహ్ కు సాటి కల్పించడం లేదా అల్లాహ్ కు అవిధేయత చూపడం ద్వారా ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా విడిచి పెట్టినట్లవుతుంది.

2. ముస్లింలు అంటే ఎవరు?

“ముస్లిం” అనే అరబీ పదం యొక్క భాషాపరమైన అర్థం ఏమిటంటే “(ఇస్లాం ధర్మానుసారం) అల్లాహ్ కు సమర్పించుకున్నవారు”. ఇస్లాం ధర్మసందేశం మొత్తం ప్రపంచం కోసం పంపబడింది. ఎవరైతే ఇస్లాం సందేశాన్ని స్వీకరిస్తారో, వారు ముస్లింగా మారిపోతారు. ఇస్లాం కేవలం అరబ్బు ప్రజల ధర్మమని కొందరు అపోహ పడుతున్నారు. అయితే అది సత్యం కాదు. వాస్తవానికి, ప్రపంచ ముస్లింలలో 80% కంటే ఎక్కువ మంది అరబ్బులు కాదు! అరబ్బులలో అధికశాతం ముస్లింలు అయినప్పటికీ, అరబ్బులలో క్రైస్తవులు, యూదులు, నాస్తికులు కూడా ఉన్నారు. ఒకవేళ నైజీరియా నుండి బోస్నియా వరకు మరియు మొరాకో నుండి ఇండోనేషియా వరకు ముస్లిం ప్రపంచంలో నివశిస్తున్న వేర్వేరు ప్రజలపై ఒకసారి దృష్టిసారిస్తే, ముస్లింలు వేర్వేరు జాతుల నుండి, వర్గాల నుండి, సంస్కృతులు, సంప్రదాయాల నుండి మరియు జాతీయతల నుండి వచ్చారనేందుకు అది చక్కగా సరిపోతుంది. ఎల్లప్పుడూ ఇస్లాం ధర్మం యొక్క సందేశం విశ్వవ్యాప్తంగా ప్రజలందరికోసం ఉండింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆరంభవు సహచరులు అరబ్బులు మాత్రమే కాకుండా, వారిలో కొందరు పర్షియన్లు, ఆఫ్రికన్లు మరియు బైజాంటీన్ రోమన్లు కూడా ఉండటం దీనిలోని వాస్తవికతను నిరూపిస్తున్నది. ఒక ముస్లింగా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ధర్మాదేశాలు మరియు దివ్యసందేశాలను పూర్తిగా స్వీకరించవలసి ఉంటుంది మరియు నిర్లక్ష్యం చేయకుండా విధేయత చూపవలసి ఉంటుంది. తన నమ్మకాలు, విలువలు మరియు విశ్వాసానికి అల్లాహ్ యొక్క అభీష్టాన్నే ఆధారంగా చేసుకోవడాన్ని ఒక ముస్లిం స్వచ్ఛందంగా స్వీకరిస్తాడు. ఈనాడు అంతగా కనబడకపోయినా, పూర్వకాలంలో “ముహమ్మదీయులు” అనే పదాన్ని ముస్లిం పదానికి బదులు తరుచుగా వాడేవారు. ముహమ్మదీయులు అనే పదం సరైన పదం కాదు. కావాలని దురుద్దేశంతో అలా చేసి ఉండవచ్చు లేదా కేవలం అజ్ఞానం వలన. ఈ అపోహకు ఒక కారణం ఏమిటంటే, క్రైస్తవులు జీసస్ ను ఆరాధిస్తున్నట్లుగా, ముస్లింలు ముహమ్మద్ ను ఆరాధిస్తారని శతాబ్దాలకు తరబడి యూరోపియన్లకు బోధించడం జరిగింది. దీనిలో అణువంత నిజం కూడా లేదు. ఎందుకంటే, ఒకవేళ ఎవరైనా అల్లాహ్ తో పాటు ఎవరినైనా లేదా దేనినైనా ఆరాధిస్తే అతను ముస్లింగా పరిగణించబడదు.

3. అల్లాహ్ అంటే ఎవరు ?

ఇస్లాం ధర్మం గురించి చర్చిస్తున్నప్పుడు, మనం తరుచుగా “అల్లాహ్” అనే అరబీ పదాన్ని వింటూ ఉంటాము. “అల్లాహ్” అనే అరబీ పదం సింపుల్ గా సర్వలోక సృష్టికర్త యొక్క అసలు పేరు. ఇదే పదాన్ని అరబీ భాష మాట్లాడే యూదులు మరియు క్రైస్తవులు కూడా వాడతారు. వాస్తవానికి అల్లాహ్ అనే పదం గాడ్ అనే పదం ఉనికి లోనికి రాకముందు చాలా కాలం నుండే వాడుకలో ఉండింది. ఎందుకంటే ఇంగ్లీషు భాష అంత ప్రాచీనమైన భాష కాదు. అది ఈమధ్యనే ఏర్పడింది. ఒకవేళ ఎవరైనా అరబీ భాషలోని బైబిల్ అనువాదాన్ని గమనిస్తే, అందులో గాడ్ అనే పదానికి బదులుగా అల్లాహ్ అనే పదమే వాడినట్లు గుర్తిస్తారు. ఉదాహరణకు, అరబ్బీ భాష మాట్లాడే క్రైస్తవులు తమ క్రైస్తవ విశ్వాసాల ఆధారంగా జీసస్ ను అల్లాహ్ కుమారుడని అంటారు. అంతేకాదు, ఇతర సెమిటిక్ భాషలలో సృష్టికర్తను సూచించే పదం అరబీ భాషలో సృష్టికర్తను సూచించే అల్లాహ్ పదానికి చాలా దగ్గరగా ఉంది. అనే అరబీ పదానికి చాలా దగ్గరి పదాన్ని వాడేవారు. ఉదాహరణకు, హిబ్రూ భాషలో సృష్టికర్తను సూచించే పదం “ఎలాహ్”. వివిధ కారణాల వలన ముస్లింలు ఆరాధించే దైవం మరియు అబ్రహాం, మోసెస్, జీసస్ లు ఆరాధించిన దైవం వేరని పొరపాటున కొందరు ముస్లిమేతరులు నమ్ముతున్నారు. దీనిలో సత్యం ఏ మాత్రమూ లేదు. ఎందుకంటే, ఇస్లాం ధర్మం యొక్క స్వచ్ఛమైన ఏకదైవత్వం ప్రజలందరినీ నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ఇతర ప్రవక్తలందరి ఆరాధ్య దైవమైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని ఆహ్వానిస్తున్నది.

4. ముహమ్మద్ అంటే ఎవరు?

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవజాతి కొరకు పంపబడిన చిట్టచివరి ప్రవక్త. తన 40వ సంవత్సరంలో అల్లాహ్ నుండి ఆయన దివ్యవాణి అందుకున్నారు. తన మిగిలిన జీవితమంతా ఆయన అల్లాహ్ తనపై అవతరింపజేసిన ఇస్లాం ధర్మం గురించి వివరించడంలో, స్వయంగా అక్షరాలా ఆచరించి చూపడంలో గడిపారు. అనేక కారణాల వలన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర ప్రవక్తలందరి కంటే గొప్పవారు. ముఖ్యంగా అల్లాహ్ ఆయనను చిట్టచివరి ప్రవక్తగా ఎంచుకోవడం. తద్వారా మానవజాతికి మార్గదర్శకత్వం వహించే బాధ్యతను ఆయన ప్రళయదినం వరకు కొనసాగించవలసి ఉన్నది. ఈ బృహత్తర బాధ్యత ఇతర ప్రవక్తల అనుచరుల కంటే ఎక్కువ మంది ప్రజలను స్వచ్ఛమైన ఏకదైవత్వాన్ని విశ్వసించడం వైపుకు తీసుకు వచ్చింది. మానవజాతి సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ అనేకమంది ప్రవక్తలను భూమండలంపై పంపి, ప్రతి ఒక్క ప్రవక్తను ముఖ్యంగా అతని సమాజం కోసం మాత్రమే పంపినాము. ముఖ్యంగా ప్రతి జాతి కొరకు వారిలో నుండే ప్రవక్తను ఎంచుకున్నాడు. ఆది నుండి అల్లాహ్ ప్రవక్తలను భూమిపైకి పంపినాడు, ముఖ్యంగా ప్రతి జాతి కొరకు వారిలోని ఒక ఉత్తమ వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకున్నాడు. అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం మానవజాతి కొరకు అంతిమ ప్రవక్తగా పంపబడినారు.

తామూ ఏకైక ఆరాధ్యుడినే విశ్వసిస్తామని ఇతర సమాజాలు కూడా వాదిస్తున్నప్పటికీ, క్రమేణా వారి విశ్వాసాలలో కలుషిత ఆలోచనలు మరియు ఆచరణలు ప్రవేశించి, వారిని ప్రవక్తల స్వచ్ఛమైన, నిష్కళంకమైన ఏకదైవారాధన నుండి దూరంగా తీసుకు పోయాయి. కొందరు తమ ప్రవక్తలను మరియు పుణ్యపురుషులను సృష్టికర్తకు తమ ప్రార్థనలు అందజేసే మధ్యవర్తులుగా చేసుకున్నారు. మరికొందరు వారి ప్రవక్తలు స్వయంగా దేవుళ్ళని లేదా దేవుడి అవతారాలని లేదా దేవుడి కుమారుడని విశ్వసించడం మొదలు పెట్టినారు. ఇలాంటి అపార్థాలన్నీ సృష్టికర్తను ఆరాధించడం వదిలి పెట్టి, సృష్టిని ఆరాధించే వైపుకు దారి తీస్తున్నాయి. ఆ విధంగా మధ్యవర్తుల ద్వారా సృష్టికర్త వద్దకు చేరవచ్చనే నమ్మకాన్ని కలిగించి విగ్రహారాధన పద్ధతులను వ్యాపింపజేసాయి.  ఇలాంటి అసత్య నమ్మకాల నుండి జాగ్రత్త పడటానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ తాను కేవలం అల్లాహ్ సందేశాన్ని అందజేయటానికి మరియు స్వయంగా ఆచరించి చూపడానికి ఎంచుకోబడిన ఒక మానవ మాత్రుడిని మాత్రమేనని నొక్కి వక్కాణించేవారు. “అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు” అని మాత్రమే తనను గుర్తించాలని ఆయన ముస్లింలకు బోధించారు. ఆయన జీవితం మరియు బోధనల ద్వారా అల్లాహ్ ఆయనను ప్రజలందరి కొరకు ఒక పరిపూర్ణ ఉపమానంగా చేసినాడు. – ఆయన ఒక అసాధారణ ప్రవక్త, రాజనీతిజ్ఞుడు, వ్యవహారకుశలుడు, సైన్యాధ్యక్షుడు, పరిపాలకుడు, బోధకుడు, పొరుగింటి వాడు, భర్త, తండ్రి మరియు స్నేహితుడు. ఇతర ప్రవక్తలు మరియు సందేశహరుల మాదిరిగా కాకుండా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా చరిత్ర వెలుగులో జీవించారు, ఆయన యొక్క పలుకులు మరియు ఆచరణలు అపూర్వంగా సేకరించబడి, నమోదు చేయబడినాయి. ఆయన ఒకానొక కాలంలో జీవించారని లేదా ఆయన ఉపదేశాలు జాగ్రత్తగా భద్రపరచబడినాయని నమ్ముతూ సరిపుచ్చ వలసిన అవసరం ముస్లింలకు లేదు. అది ఖచ్ఛితమైన వాస్తవమని వారికి తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన దివ్యసందేశాన్ని ప్రజలు కోల్పోకుండా, మరిచిపోకుండా, కలుషితం చేయకుండా సురక్షితంగా కాపాడే బాధ్యతను అల్లాహ్ స్వయంగా తానే తీసుకున్నాడు. ఇది చాలా ఆవశ్యకమైన విషయం ఎందుకంటే మొత్తం మానవాళి కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడని అల్లాహ్ ప్రకటించినాడు. అల్లాహ్ యొక్క ప్రవక్తలందరూ ఇస్లాం సందేశాన్నే బోధించారు అంటే కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు అల్లాహ్ యొక్క ధర్మాదేశాలకు సమర్పించుకోండి. కాలక్రమంలో ఆ దివ్యసందేశాన్ని ప్రజలు కోల్పోవటం లేదా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడు కావడం వలన, ఆయనపై ప్రళయదినం వరకు ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాజాలని చిట్టచివరి మరియు పరిపూర్ణ దివ్యసందేశం అవతరింపజేయబడింది.  

5. ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తున్నది?

ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క అసలు పునాది సంపూర్ణ ఏకదైవారాధన. అంటే సృష్టిలోని ప్రతిదాని కొరకు కేవలం ఒకే ఒక సృష్టికర్త మరియు పోషకుడు ఉన్నాడని, ఆయన తప్ప సృష్టిలో మరేదీ దివ్యం కాదనీ మరియు మరెవరికీ ఆరాధింపబడే అర్హతలు లేవనీ విశ్వసించడం. నిజంగా, ఏకైక సృష్టికర్తను విశ్వసించడం అంటే సింపుల్ గా “ఒక దేవుడున్నాడని” విశ్వసించడం కంటే చాలా గొప్పది – ఎందుకంటే అది రెండు, మూడు లేదా నాలుగు దేవుళ్ళ ఆలోచనను పూర్తిగా ఖండిస్తుంది. “ఒకే దేవుడు” ఉన్నాడని మరియు చివరికి ఒకే ఒక సృష్టికర్త మరియు పోషకుడు ఉన్నాడని విశ్వసిస్తున్నామని వాదించే ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ, నిజమైన ఏకదైవత్వంలో ‘ఏకైక ఆరాధ్యుడిని తన ప్రవక్తలపై ఆయన పంపిన దివ్యసందేశం ప్రకారం మాత్రమే ఆరాధించాలని విశ్వసించ వలసి ఉన్నది’. అంతేగాక, మానవుడికి మరియు సృష్టికర్తకు మధ్య అన్ని రకాల మధ్యవర్తులనూ ఇస్లాం ధర్మం పూర్తిగా తిరస్కరిస్తున్నది. ప్రజలు ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా తమ ప్రభువు వద్ద తిన్నగా వేడుకోవచ్చని మరియు అన్ని రకాల ఆరాధనలు కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయని నొక్కి చెబుతున్నది. సర్వలోక సృష్టికర్త అత్యంత కరుణామయుడు, ప్రేమించేవాడు మరియు అపార కృపాశీలుడని ముస్లింలు నమ్ముతారు.

తన సృష్టిని ప్రభువును తిన్నగా క్షమించడనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రజలలో విస్తృతంగా వ్యాపించి ఉన్నది. పాపాల భారాన్ని మరియు శిక్షల గురించి అపరిమితంగా భయపెట్టడం మరియు సృష్టికర్త మానవులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా తిన్నగా క్షమించడు అనే తప్పుడు వాదనల వలన ప్రజలు తరుచుగా సృష్టికర్త యొక్క కారణ్యం లభించదనే నిరాశతో ఆయనకు దూరమై పోతుంటారు. ఎప్పుడైతే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సృష్టికర్తను తిన్నగా ప్రార్థించలేమనే వాదన సరైనదని భావిస్తారో, వెంటనే వారు సహాయం కోసం హీరోలు, రాజకీయ నాయకులు, బాబాలు, స్వాములు, దైవదూతల వంటి అసత్య దైవాల వైపు మరలటం మొదలు పెడతారు. ఎవరైతే ఇలాంటి అసత్య దైవాలను ఆరాధిస్తారో, వేడుకుంటారో లేదా దేవుడి వద్ద మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ ప్రార్థనలు అందజేయమని అర్థిస్తారో, తరుచుగా అలాంటి వారు ఆ మధ్యవర్తులను దేవుళ్ళుగా పరిగణించకపోవడాన్ని మనం చూస్తుంటాము. వారు మహోన్నతుడైన దేవుడినే విశ్వసిస్తున్నామని దావా చేస్తారు. కానీ, కేవలం ఆయనకు మరింత చేరువయ్యేందుకు మాత్రమే తాము ఆయనతో పాటు ఇతరులను వేడుకుంటున్నామని లేదా ఆరాధిస్తున్నామని వాదిస్తారు. ఇస్లాం ధర్మంలో, సృష్టికర్త మరియు సృష్టిల మధ్య నున్న వ్యత్యాసం గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. దైవత్వ విషయాలలో ఎలాంటి అస్పష్టత లేక రహస్యం లేదు. ఎందుకంటే ఇస్లాం ధర్మ బోధనల ప్రకారం: సృష్టించబడినది ఏదైనా సరే, ఆరాధింపబడే అర్హతలు కలిగి ఉండదు; ఆరాధింపబడే అర్హతలు కేవలం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే ఉన్నాయి. సృష్టికర్త తన సృష్టిలో భాగంగా అవతరించాడనే తప్పుడు విశ్వాసాన్ని కొన్ని ధర్మాలు కలిగి ఉన్నాయి. అది ‘సృష్టితాలను ఆరాధించడం ద్వారా సృష్టికర్త వద్దకు చేర వచ్చని’ ప్రజలు నమ్మేలా చేస్తున్నది.

సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఏకైకుడు, మహోన్నతుడు, ఎవ్వరి ఊహలకూ అందని వాడైనప్పటికీ,  నిశ్చయంగా ఆయనకు ఎలాంటి భాగస్వాములు, సహాయకులు, సహచరులు, విరోధులు లేక సంతానం లేరని ముస్లింలు నమ్ముతారు. ముస్లింల విశ్వాసం ప్రకారం, శబ్దార్థ ప్రకారం, ఆలోచనల రూపంగా, రూపకంగా, భౌతికంగా లేక అధ్యాత్మికంగా - “అల్లాహ్ ఎవ్వరికీ పుట్టలేదు, ఆయనకు ఎవ్వరూ పుట్టలేదు”. ఆయన సంపూర్ణంగా ఏకైకుడు మరియు అమరుడు, నిత్యుడు. ప్రతిదీ ఆయన నియంత్రణలో ఉన్నది. ఆయన తన అనంతమైన కారుణ్యం మరియు మన్నింపులను తను ఎంచుకున్న వారికి ప్రసాదించే పూర్తి శక్తిసామర్ధ్యాలు, నియంత్రణ కలిగి ఉన్నాడు. అందువలన అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు అత్యంత కరుణామయుడని కూడా పిలవబడుతున్నాడు. అల్లాహ్ మానవుడి కోసం మొత్తం విశ్వాన్ని సృష్టించాడు. ఎందుకంటే ఆయన మొత్తం మానవజాతి కొరకు అత్యుత్తమమైన వాటినే అభిలషిస్తాడు. ముస్లింలు విశ్వంలోని ప్రతిదాన్నీ మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ‘ప్రతిదీ సృష్టించే సమర్ధత మరియు కారుణ్య’ చిహ్నాలుగా చూస్తారు. ముస్లింలు ఇంకా, అల్లాహ్ యొక్క అద్వితీయాన్ని, ఏకత్వాన్ని విశ్వసించడమనేది కేవలం ఒక మెటాఫిజికల్ అంటే అధ్యాత్మిక భావన మాత్రమే కాదు. అది మానవత్వం, సమాజం మరియు ఆచణాత్మక జీవితపు అన్ని కోణాలపై మన దృక్పథాన్ని ప్రభావితం చేసే ఒక చైతన్యవంతమైన నమ్మకం. కాబట్టి అల్లాహ్ ఏకత్వాన్ని విశ్వసించడం యొక్క హేతుబద్ధమైన ఒక పరిణామం ఏమిటంటే మానవజాతి మరియు మానవత్వం యొక్క ఏకత్వంపై విశ్వాసం ఏర్పడుతుంది.

6. ఖుర్ఆన్ అంటే ఏమిటి?

మొత్తం మానవజాతి కొరకు పంపబడిన అంతిమ దివ్యసందేశమే ఖుర్ఆన్ దివ్యగ్రంథం. జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అరబీ భాషలో పంపిన శబ్ద, వచన మరియు అర్థాల దివ్యవాణి. తర్వాత దానిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు అందజేయగా, వారిలో అక్షరం పొల్లుపోకుండా కొందరు కంఠస్థం చేసారు, మరికొందరు వ్రాతపూర్వకంగా నమోదు చేసి, గ్రంథ రూపంలో సంకలనం చేసారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, వారి తర్వాత తరం వారు, వారి తర్వాత తర్వాత తరం వారు ... అలా తరతరాలుగా ఈరోజు వరకు, దివ్యఖురఆన్ నిరంతరంగా కంఠస్థం చేయబడుతున్నది మరియు పఠించబడుతున్నది. క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం మానవజాతి మార్గదర్శత్వం మరియు మోక్షం కోసం అల్లాహ్ పంపిన అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాకుండా అవతరించిన రూపంలోనే సురక్షితంగా ఉన్నది.

ఈనాటికీ మిలియన్ల కొద్దీ ప్రజలు ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేస్తున్నారు మరియు బోధిస్తున్నారు. ఖుర్ఆన్ అవతరించబడిన అరబీ భాష నేటికీ మిలియన్ల కొద్దీ ప్రజలు మాట్లాడే సజీవ భాషగా మిగిలి ఉన్నది. కొన్ని ఇతర ధర్మాల దివ్యగ్రంథాల వలే కాకుండా, ఈనాటికీ ఖుర్ఆన్ గ్రంథాన్ని దాని అసలు అవతరించబడిన అరబీ భాషలో లెక్కలేనన్ని మిలియన్ల ప్రజలు పఠిస్తున్నారు. అరబీ భాషలోని ఒక సజీవ అద్భుతం ఖుర్ఆన్ గ్రంథం. దాని శైలి, రూపం మరియు ఆధ్యాత్మిక ప్రభావం, అద్వితీయమైన జ్ఞానం మొదలైన ప్రత్యేత లక్షణాలు సాటిలేనివి, అస్సలు అనుకరించనలవి కానివి. ఖుర్ఆన్ 23 ఏళ్ళ సుదీర్ఘకాలంలో అంచెలంచెలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. ఇతర అనేక ధర్మాలకు భిన్నంగా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క ఖచ్చితమైన వాక్కని ఎల్లప్పుడూ విశ్వసించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మరియు ఆ తర్వాత ఖుర్ఆన్ గ్రంథం ముస్లిం సమాజం ఎదుట మరియు ముస్లిమేతర సమాజాల ఎదుట నిరంతరంగా పఠించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే మొత్తం ఖుర్ఆన్ అక్షరం పొల్లుపోకుండా అవతరించిన అసలు రూపంలో వ్రాతపూర్వకంగా నమోదు చేయబడింది మరియు అనేక మంది సహచరులు ఒక్క అక్షరమూ వదలకుండా మొత్తం ఖుర్ఆన్ గ్రంథాన్ని ఆయన నుండి కంఠస్థం చేసారు. ఖుర్ఆన్ గ్రంథం ఎల్లప్పుడూ సాధారణ విశ్వాసులకు కూడా అందుబాటులో ఉండింది: ఎల్లప్పుడూ అది అల్లాహ్ యొక్క ఖచ్చితమైన వాక్కుగానే పరిగణింపబడటం మరియు ఎక్కువగా కంఠస్థం చేయబడటం వలన, అది సంపూర్ణంగా భద్రపరచ బడింది. ఏ ధార్మిక సంస్థ కూడా దానిలోని ఏ భాగాన్నీ మార్చలేదు లేదా తొలగించలేదు. ఖుర్ఆన్ బోధనలలో మొత్తం మానవజాతిని సంబోధించే సార్వజనిక దివ్యసందేశాలు ఎన్నో ఉన్నాయి. దానిలో కేవలం ఏదో ఒక ప్రత్యేక తెగ లేదా ఎంచుకోవబడిన ప్రజలను మాత్రమే సంబోధించబడలేదు. ఇతర ప్రవక్తలు అందించిన క్రింది సందేశాన్నే అది కూడా అందిస్తున్నదే తప్ప ఏదో కొత్త సందేశాన్ని కాదు: 'ఇహపర లోకాలలో సాఫల్యం కోసం ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు మాత్రమే సమర్పించుకోవాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను మాత్రమే అనుసరించాలి'. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించడం మరియు ఆయన పంపిన దివ్యసందేశాన్ని అనుసరించి జీవించడం అంటే ఇస్లామీయ ధర్మచట్టాన్ని అనుసరించి జీవించడంలోని ప్రాధాన్యత గురించి మానవులకు బోధించడంపై ఖుర్ఆన్ గ్రంథం దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇంకా ఖుర్ఆన్ గ్రంథంలో నూహ్, ఇబ్రాహీం, మూసా మరియు ఈసా అలైహిస్సలాం మొదలైన పూర్వ ప్రవక్తల వృత్తాంతాలు, అల్లాహ్ యొక్క ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో, అనేక మంది ప్రజలు రకరకాల సందేహాలలో, ఆధ్యాత్మిక నిరాశ నిస్పృహలలో, సామాజిక మరియు రాజకీయ పరాధీనతలలో చిక్కుకుని ఉన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితులలో, ఖుర్ఆన్ బోధనలు మన జీవితాలలోని శూన్యాన్ని భర్తీ చేసే మరియు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంక్షోభాన్ని తొలగించే సరైన పరిష్కారాలు చూపుతున్నది.

7. మనిషి స్వభావం, మానవ జీవిత ఉద్దేశ్యం మరియు పరలోక జీవితం  గురించి ఇస్లాం ఏమంటున్నది?

తనను స్తుతించడానికి మరియు ఆరాధించడానికి మాత్రమే మానవులు సృష్టించబడినారని మరియు అసలు ఆరాధనలన్నింటి పునాది తనపై భయభక్తులు కలిగి ఉండటమేనని అల్లాహ్ ఖుర్ఆన్ లో మానవులకు స్పష్టంగా బోధించినాడు. అల్లాహ్ యొక్క సృష్టితాలన్నీ సహజంగా ఆయనను మాత్రమే ఆరాధిస్తాయి. తమ సృష్టికర్త అయిన అల్లాహ్ ను ఆరాధించే లేదా ఆయనను తిరస్కరించే స్వేచ్ఛ కేవలం మానవులకు మాత్రమే ఇవ్వబడింది. ఇదొక కఠినమైన పరీక్ష. అంతేగాదు, ఇదొక గొప్ప సన్మానం కూడా. ఇస్లామీయ బోధనలు మన జీవితపు కోణాలన్నింటినీ మరియు నైతికతలన్నింటినీ ఆవరించి ఉండటం వలన, మానవుల వ్యవహారాలన్నింటిలో సృష్టికర్త యొక్క భయభక్తులు ప్రోత్సహించబడినాయి. చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఆచరిస్తే మరియు ఆయన దివ్యసందేశాన్ని - ధర్మచట్టాన్ని అనుసరించి చేస్తే, మానవుల వ్యవహారాలన్నీ ఆరాధనలుగా మారే అవకాశం ఉన్నదని ఇస్లాం ధర్మం స్పష్టం చేసింది. కాబట్టి, ఇస్లాం ధర్మంలో ఆరాధనలు కేవలం ధార్మిక ఆచరణలకు మాత్రమే పరిమితం కాలేదు. అందువలన, దానిని ఒక ధర్మం అనడం కంటే ‘ఒక సత్యజీవిన విధానం’ అనడం సబబుగా ఉంటుంది. ఇస్లామీయ బోధనలు మానవాత్మ కొరకు ఒక కారుణ్యంగా మరియు స్వస్థత చేకూర్చేవిగా పని చేస్తున్నాయి. అంతేగాక, అవి ప్రజలలో మానవత్వం, చిత్తశుద్ధి, సహనం మరియు దానధర్మాలు మొదలైన లక్షణాలను చాలా బలంగా ప్రోత్సహిస్తున్నాయి. ఇంకా, అహంభావం మరియు తనే కరక్టు అనే గర్వాలను ఇస్లాం ధర్మం పూర్తిగా ఖండిస్తున్నది. ఎందుకంటే కేవలం అల్లాహ్ మాత్రమే మానవుల ధర్మబద్ధతపై తీర్పు నిస్తాడు.

మానవస్వభావం గురించిన ఇస్లామీయ దృక్పథం కూడా వాస్తవమైనది మరియు సంతులితమైనది. మానవులు వారసత్వ పాపాత్ములుగా జన్మించలేదని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. కానీ, వసమానంగా చెడులను శక్తిసామర్ధ్యాలు ఉన్నారని వాటిలో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వబడింది. దైవవిశ్వాసం మరియు ఆచరణ ఒకదానితో ఒకటి కలిసి మెలిసి ఉన్నాయని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. అల్లాహ్ ప్రజలకు తమ దారి ఎంచుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. వారి పనులు మరియు ఆచరణలను బట్టి వారి విశ్వాసం ఉంటుంది. ఏదేమైనా, మానవులు కూడా జన్మతః బలహీనులుగా సృష్టించబడటం మరియు తరచుగా పాపాలలో కూరుకు పోవడం వలన, వారు నిరంతరం మార్గదర్శకత్వం కోసం వేడుకోవలసిన మరియు పశ్చాత్తాప పడవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది స్వయంగా ఒక ఆరాధన మరియు అల్లాహ్ కు ఎంతో ఇష్టం. తన అద్వితీయమైన శక్తి మరియు వివేకాలతో అల్లాహ్ సృష్టించిన మానవుడి స్వభావం అంతర్గతంగా కలుషితం కాదు, దానిని సరిదిద్దవలసిన అవసరమూ రాదు. పాపాత్ములు, తప్పులు చేసిన వారి కోసం పశ్చాత్తాప ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. మానవులు తప్పులు చేస్తారని సృష్టికర్తకు తెలుసు. అయితే వారు చేసిన తప్పులకు, పాపాలకు పశ్చాత్తాపంతో ఆయన వైపు మరలుతారా లేదా, తిరిగి అలాంటి తప్పులకు, పాపాలు చేస్తారా లేదా వాటికి దూరంగా ఉంటారా, అల్లాహ్ కు అయిష్టమని, ఆగ్రహిస్తాడని తెలిసీ పాపాలతో నిండిన దుష్ట జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారా అనేదే అసలు పరీక్ష. పాపాలకు మరియు చెడు పనులకు అల్లాహ్ న్యాయంగా శిక్షిస్తాడనే సముచితమైన భయం మరియు తన అపార కృప వలన మంచిపనులకు అల్లాహ్ తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడనే ఆశల మధ్య ఇస్లామీయ జీవితం యొక్క నిజమైన సంతులనం స్థాపించబడింది. అల్లాహ్ భయం లేని జీవితం, పాపం మరియు అవిధేయతల వైపుకు తీసుకు పోతుంది. అలాగే, మనం ఎన్నో పాపాలు చేయడం వలన అల్లాహ్ మనల్ని క్షమించే అవకాశం లేదనే భావం నిరాశా, నిస్పృహల వైపుకు మరియు వైరాగ్యం వైపుకు తీసుకు పోతుంది. ఈ వాస్తవాల వెలుగులో, కేవలం మార్గభ్రష్టులు మాత్రమే అల్లాహ్ కారుణ్యాన్ని పొందరని మరియు కరుడు కట్టిన నేరస్థులు మాత్రమే సృష్టికర్త మరియు అత్యంత న్యాయవంతుడైన అల్లాహ్ యొక్క శిక్షల నుండి తప్పించుకోలేరని కేవలం  ఇస్లాం బోధిస్తున్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ఖుర్ఆన్ దివ్యగ్రంథంలో పరలోక జీవితం మరియు అంతిమ తీర్పుదినం గురించి అనేక విషయాలు ఉన్నాయి. చివరికి మానవులందరి ప్రాపంచిక జీవితపు విశ్వాసాలు మరియు ఆచరణలను అద్వితీయ సార్వభౌముడు మరియు అత్యంత న్యాయాధీశుడైన అల్లాహ్ అంతిమ తీర్పుదినాన విచారిస్తాడని ముస్లింలు నమ్ముతారు. మానవులను విచారించడంలో మహోన్నతుడైన అల్లాహ్ అత్యంత న్యాయంగా వ్యవహరిస్తాడు. పశ్చాత్తాపపడని అసలు నేరస్థులు, తిరుగుబాటుదారులు, అవిధేయులు మరియు దోషులను మాత్రమే శిక్షిస్తాడు. తన కారుణ్యానికి యోగ్యులైన వారిని దివ్యమైన వివేకంతో గ్రహించి, వారిపై దయ చూపుతాడు. తమ స్తోమతకు మించిన భారం గురించి ప్రజలు విచారించబడరు మరియు నిజంగా చేయని పనులకు వారు శిక్షించబడరు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ప్రాపంచిక జీవితం సర్వలోక సృష్టికర్త, మహోన్నతుడు మరియు అత్యంత వివేకవంతుడైన అల్లాహ్ నిర్ణయించిన ఒక పరీక్ష, అంతిమ తీర్పుదినాన అల్లాహ్ ముందు మానవులందరూ ఈ ప్రాపంచిక జీవితంలో తాము చేసిన పనులకు స్వయంగా తామే బాధ్యత వహిస్తారు అని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. పరలోక జీవితాన్ని చిత్తశుద్ధితో విశ్వసించడమనేది ఈ ప్రపంచంలో సరైన సంతులిత మరియు నైతిక జీవితం గడిపేందుకు తాళం చెవి లాంటిది. అలా విశ్వసించక పోతే, ఈ ప్రాపంచిక జీవితం ఇంతటితోనే ముగిసి పోతుందనిపించి, హేతువాదం మరియు నైతికతను త్యజించి, అల్ప సుఖసంతోషాలను అడ్డదారులలో చేజిక్కించుకునే ప్రయత్నంలో ప్రజలు స్వార్థపరులుగా, మటీరియలిష్టులుగా అంటే భౌతికవాదులుగా మారిపోతారు మరియు అనైతికత, అరాచకత్వం విస్తృతంగా వ్యాపిస్తుంది. 

Choose Your Language