అరబీ భాషలోని ‘ఇస్లాం’ అనే పదానికి అర్థం శాంతి, సమర్పణ మరియు విధేయత. ఇస్లాం ధర్మం అంటే మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా అవతరింపజేసిన ఆదేశాలను మరియు మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అంగీకరించటం, స్వీకరించటం, ఆమోదించటం మరియు సమ్మతించటం.
‘ముస్లిం’ అంటే మనస్పూర్తిగా అల్లాహ్ ను విశ్వసించేవాడు, తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నవాడు. ఆయన అవతరింజేసిన దివ్యఖుర్ఆన్ మార్గదర్శకత్వం మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మోపదేశాలకు అనుగుణంగా తన జీవిత విధానాన్ని పూర్తిగా సరిదిద్దుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించేవాడు. వీటి ఆధారం పై మానవ సమాజ నిర్మాణం కొరకు పనిచేసేవాడు. కొందరు అజ్ఞానులు ‘ముహమ్మదీయ మతం’ అనే తప్పుడు పేరుతో ఇస్లాం ధర్మాన్ని పిలుస్తారు. ఈ పేరు ఇస్లాం ధర్మం యొక్క అసలు మూలాంశాలకు పూర్తిగా విరుద్ధమైంది.
'అల్లాహ్' అంటే అరబీ భాషలో దేవుడి అసలు పేరును సూచించే దివ్యమైన పదం. ఇది ఒక అపూర్వమైన, అసమానమైన, అద్వితీయమైన ఏకైక పదం. ఎందుకంటే ఈ పదానికి బహువచన రూపం లేదా స్త్రీలింగ రూపం లేదు. (దేవుడు – దీని బహువచన రూపం దేవుళ్ళు; స్త్రీలింగ రూపం – దేవతలు. గాడ్ – దీని బహువచన రూపం గాడ్స్; స్త్రీలింగ రూపం - గాడెస్)