దివ్యసందేశాల పరంపర

ఇస్లాం ఒక నూతన ధర్మ కాదు. అల్లాహ్ తన ప్రవక్తలందరికీ పంపిన అదే దివ్యసందేశం మరియు మార్గదర్శకత్వమిది. అయితే చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ఈ ఇస్లాం సందేశ ప్రత్యేకత ఏమిటంటే అది తన యొక్క సమగ్రమైన, సంపూర్ణమైన మరియు అంతిమ రూపంలో ఆయనపై అవతరించింది. 

దివ్యఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావార్థం:

వారితో ఇలా అనండి: "మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మాపై అవతరింపజేయబడిన దానిని కూడా; అలాగే ఇబ్రాహీము పై, ఇస్మాయీలు పై, ఇస్ హాఖు పై, యాఖూబు పై మరియు అతని సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, ఇంకా మూసా-ఈసాలకూ మరియు ఇతర ప్రవక్తలకూ వారి ప్రభువు తరపు నుండి ప్రసాదించబడిన దానినీ విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి మధ్యనా మేము వ్యత్యాసం చూపము మరియు మేము కేవలం ఆయనకే తల ఒగ్గి విధేయులైన వారం" 

(ఖుర్ఆన్ 3:84)

ఇస్లాం ధర్మం యొక్క ఐదు ప్రధాన మూలాంశాలు:

1. సాక్ష్యప్రకటన : “ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు - ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ - అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు” అని సాక్ష్యమివ్వడం. దీనిని అరబీ భాషలో అష్షహాదహ్ అంటారు.

మొత్తం మానవజాతి కొరకు పంపబడిన చిట్టచివరి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). తన యొక్క ఆదర్శవంతమైన జీవన విధానాన్నే అనుసరించమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వం ప్రతి ముస్లింను నిర్బంధిస్తున్నది.

2. ఆరాధనలు (సలాహ్, నమాజు): అల్లాహ్ కొరకు మన బాధ్యతగా భావిస్తూ ప్రతి రోజూ ఐదు పూటలా నమాజు చేయడం. అవి అల్లాహ్ పై విశ్వాసాన్ని మరియు సామీప్యాన్ని దృఢపరుస్తాయి. అంతేగాక మనిషిని ఉత్తమ సంస్కారాల వైపు ప్రోత్సహిస్తాయి. హృదయాన్ని పరిశుద్ధపరుస్తాయి. చెడు నుండి ఆపుతాయి.

3. రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించడం: రమదాన్ నెలలో తెల్లవారు ఝాము నుండి సూర్యాస్తమయం వరకు ముస్లింలు అన్నపానీయాల నుండి మరియు దాంపత్య సుఖం నుండి దూరంగా ఉండటమే కాకుండా, చెడు ఆలోచనల నుండి మరియు చెడు కోరికల నుండి కూడా దూరంగా ఉంటారు. అది ప్రేమ, చిత్తశుద్ధి మరియు భక్తిని నేర్పుతుంది. అంతేగాక సామాజిక విచక్షణ, సహనం, నిస్వార్థం మరియు సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.

4. జకాతు : సంవత్సరం పాటు నిల్వ ఉన్న తమ ధనంలో నుండి 2.5% ధనాన్ని ధార్మిక కర్తవ్యంగా మరియు పాప ప్రక్షాళణ కోసం తమ సమాజంలోని బీదవారికి దానమివ్వడం.

5. హజ్ యాత్ర: మంచి ఆరోగ్యంతో, ఆర్థికంగా భరించగలిగే స్థితిలో ఉన్నపుడు జీవితంలో ఒక్కసారి మక్కా వెళ్ళి హజ్ యాత్ర చేయాలి.

ఈ ఐదు మూలాంశాలు మాత్రమే కాకుండా, అల్లాహ్ మెప్పు కోసం చిత్తశుద్ధితో చేసే ప్రతి మంచి పనీ ఆరాధనయే. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని విశ్వసించమని ఇస్లాం ఆదేశిస్తున్నది. తద్వారా మనిషి విశ్వాన్ని మరియు విశ్వంలోని తన స్థానాన్ని అర్థం చేసుకో గలుగుతాడు. ఈ నమ్మకం అల్లాహ్ యొక్క ఉనికిని మరియు ఆయన హక్కును అతడికి గుర్తు చేస్తూ, అన్ని రకాల పిచ్చి భయాల మరియు భ్రమల నుండి,  గుడ్డినమ్మకాల నుండి, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చేస్తుంది. కేవలం విశ్వసిస్తే సరిపోదు. అది మాటలలో మరియు చేతలలో కూడా కనబడాలి మరియు ఋజువు కావాలి. కాబట్టి, మన ఏకదైవత్వ విశ్వాసం ఇస్లాం యొక్క ఐదు మూలాంశాల ద్వారా బహిర్గతమవుతుంది. మనందరి సృష్టికర్త మరియు పోషణకర్త అయిన విశ్వప్రభువును ఆరాధించే ఒక కుటుంబంగా మొత్తం మానవజాతిని చూడమని ఏక దైవత్వ విశ్వాసం నిర్దేశిస్తుంది. అవతార పురుషుల మరియు దైవాంస సంభూతుల సిద్ధాంతాన్ని ఇస్లాం తిరస్కరిస్తుంది. కేవలం స్వచ్ఛమైన ఏకదైవత్వ విశ్వాసం మరియు మంచి పనుల వలన మాత్రమే స్వర్గ ప్రవేశం లభించగలదని చెబుతున్నది. తద్వారా ఎలాంటి మధ్యవర్తులు, పూజారులు, సిఫారసు చేసేవాళ్ళు లేకుండా సృష్టికర్తను తిన్నగా ఆరాధించవచ్చు మరియు వేడుకోవచ్చు.

Choose Your Language