“ముస్లిం” అనే పదానికి అర్థం “నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త”ని ప్రకటిస్తూ, అల్లాహ్ యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా తనను తాను సమర్పించుకున్నవాడు. మరోమాటలో చెప్పాలంటే ఎవరైతే తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారో, అతడిని ముస్లిం అంటారు. కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మందు వచ్చిన ప్రవక్తలందరూ ముస్లింలే. ఖుర్ఆన్ దివ్యగ్రంథంలో ప్రత్యేకంగా మూసా మరియు ఈసా అలైహిస్సలాంల కంటే చాలా కాలం ముందు జీవించిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గురించి “ఆయన (ఇబ్రాహీం) యూదుడు కాదు క్రైస్తవుడు కాదు, కానీ ఆయన ఒక ముస్లిం,” ఎందుకంటే, ఆయన అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నారు. కాబట్టి వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను సంతృప్తిపరచాలని, ఆయన మెప్పు పొందాలని ఎల్లప్పుడూ ప్రయత్నించే ముస్లింలు కొందరు ఉన్నారు. మరికొందరు, అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకోకుండా, ఎల్లప్పుడూ ఇస్లాం పేరు మీద చెడు పనులు చేస్తూ, ఏనాడూ తమ సత్యధర్మం గురించి పట్టించుకోని ముస్లింలనబడే వారూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా ఇస్లాం ధర్మం గురించి తీర్మానించుకోకూడదు. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనదే కానీ మానవమాత్రులు కావడం వలన ముస్లింలు పరిపూర్ణులు కారు. ఒకవేళ ఎవరైనా అసలు ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే, వారు ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేయాలే గానీ ముస్లింల గురించి కాదు.