40 యేళ్ళ వయస్సులో, మొట్టమొదటిసారి హీరా గుహలో ఏకాంతంగా ఉన్నప్పుడు, దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనకు కనబడి, అల్లాహ్ నుండి తొలి దివ్యవాణిని అందజేసి, అల్లాహ్ ఆయనను అంతిమ ప్రవక్తగా ఎంచుకున్నట్లు తెలిపినారు. ఆనాటి నుండి 23 సంవత్సరాల వరకు దివ్యవాణి ఆయనపై అవతరించింది. వాటిని ఆయన సహచరులు ఖుర్ఆన్ గ్రంథంగా సంకలనం చేసినారు. ఇది మొత్తం మానవాళి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ పంపిన అంతిమ దివ్యసందేశం. దివ్యఖుర్ఆన్ దాని అసలు అవతరించిన రూపంలో సురక్షితంగా భద్రపరచబడింది. ఎన్నడూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాలేదు. తోరా(Torah), కీర్తనలు (psalms), జీసస్ సువార్తలలోని సత్యవచాలను పునఃధృవీకరించింది .
దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం నుండి విన్న వచనాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించడం మొదలు పెట్టారు మరియు తనపై అల్లాహ్ అవతరింపజేసిన సత్యసందేశాన్ని ప్రజలకు బోధించసాగారు. ఆయను మరియు ఆయనతో పాటు ఉన్న చిన్న సహచరుల సమూహం తీవ్రమైన దౌర్జన్నాన్ని, అణచివేతను ఎదుర్కొనవలసి వచ్చింది. అది ఎంత తీవ్రరూపం దాల్చిందంటే, కొన్నేళ్ళ తర్వాత మరో ప్రదేశానికి వలస వెళ్ళేందుకు అల్లాహ్ ఆయనకు అనుమతి నిచ్చాడు. మక్కా నుండి మదీనా పట్టణానికి ఆయన చేసిన ఈ వలసనే హిజ్రత్ అంటారు. దీని ఆధారంగానే ఇస్లామీయ క్యాలెండరు తయారు చేయబడింది. అనేక సంవత్సరాల తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు సాటిలేని విజేతలుగా మక్కా నగరంలో ప్రవేశించి, తమపై ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు చేసిన తమ శత్రువులను క్షమించారు, ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. 63 యేళ్ళ వయస్సులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేనాటికి, అరేబియా ద్వీపకల్పంలోని అధిక భాగం ఇస్లాం ధర్మాన్ని అనుసరించసాగింది. ఆయన మరణానంతరం, ఇస్లాం ధర్మం తూర్పులో చైనా వరకు మరియు పశ్చిమంలో స్పెయిన్ వరకు వ్యాపించింది.